వ్యాక్సిన్‌ కోసం వెంపర్లాట! తెలుగు రాష్ట్రాలు ఏం చేయబోతున్నాయి?

Fight for the vaccine What are the Telugu states going to do

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రజలంతా ఇప్పుడు వ్యాక్సిన్లకోసం వెంపర్లాడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా నుంచి ప్రాణాలతో బయటపడొచ్చని నిర్ధారణ కావడంతో అందరూ టీకా కోసం పరుగులు తీస్తున్నారు. అయితే డిమాండ్‌ కు సరిపడా టీకాలు అందుబాటులో లేవు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టీకాలకు తీవ్ర కొరత ఏర్పడింది. 

మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో టీకా కొరత వెంటాడుతోంది. సరిపడినన్నీ డోసులు లేక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆలస్యమవుతోంది. తెలంగాణలో నిన్న కేవలం 59 వేల టీకాలను మాత్రమే వేశారు. రాష్ట్రంలో మరో రోజుకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్ రాకపోతే రేపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగింపు అనుమానం అంటున్నారు. అయితే కేంద్రం నుంచి ఎన్ని డోసులు వస్తాయో తెలియని అయోమయంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఉంది. ఇలాగైతే అందరికీ టీకా ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని  అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని డోసులు పంపాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు.

తెలంగాణలో ఇప్పటివరకూ పది శాతం మందికే వ్యాక్సిన్‌ ఇచ్చారు. టీకా వేసుకునేందుకు మొదట విముఖత చూపిన ప్రజలు.. సెకండ్‌ వేవ్‌ ఉధృతి పెరగడంతో ఇప్పుడు వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాలతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో కొరత ఏర్పడింది. ఇప్పటివరకు తెలంగాణలో 41 లక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ అందజేసింది. నిత్యం రెండు లక్షల డోసులు అందిస్తోంది. ఇప్పుడు కొరతను అధికమించేది ఎలా.. అన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 

తెలంగాణలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 14 వందల 73 కేంద్రాల్లో టీకా ఇస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రాల్లో 12 వందల 19 చోట్ల, ప్రైవేటు ఆస్పత్రుల్లో 254 కేంద్రాల్లో టీకా వేస్తున్నారు. మే 1 నుంచి వ్యాక్సిన్‌ పంపిణీని విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో.. పంపిణీ కేంద్రాలకు కూడా 4 వేలకు పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకు కోసం కమ్యూనిటీ హాల్స్‌, ప్రభుత్వం పాఠశాలను వాడుకోవాలని నిర్ణయించింది. అలాగే అపార్ట్‌మెంట్స్‌లో కూడా టీకా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించింది. మూడుదశలో రోజుకు ఐదు లక్షల టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. వ్యాక్సిన్ల కొరతతో ఏపీ అల్లాడుతోంది. రోజుకు 10లక్షలకు పైగా టీకాలు వేసే సామర్థ్యం తమకుందని ఏపీ చెప్తోంది. అందుకు తగ్గట్లు టీకాలు పంపించాలని కేంద్రాన్ని కోరుతోంది. ప్రస్తుతం కొరత వల్ల టీకాల పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిన్న రాష్ట్రానికి 4 లక్షల కోవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. అయితే అవన్నీ ఈరోజుకు మాత్రమే సరిపోతాయంటున్నారు అధికారులు. కోవాగ్జిన్‌ కోసం అధికారులు ఎదురుచూపులు చూస్తున్నారు. రెండో డోస్‌ వేయించుకునేవారి కోసం భారీగా కోవాగ్జిన్ కావాలంటున్నారు అధికారులు. 

ఏపీలో 18 ఏళ్ల దాటిన వారు సుమారు నాలుగు కోట్ల మంది వరకు ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. వీరిలో సుమారు మూడున్నర కోట్ల మంది 18 నుంచి 45 వయస్సులోపు వారుంటారు. వీళ్లందరికీ మే 1 నుంచి టీకా వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాలంటే కనీసం 7కోట్ల డోసులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 4.08కోట్ల డోసులు కావాలి. మరి అన్ని డోసులను కంపెనీలు సప్లై చేయగలవా.. చేస్తే ఎంతకాలానికి చేయగలుగుతాయి.. ఎప్పటిలోపు ప్రజలకు వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయగలుగుతుంది.. అనేవి ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు.


                    Advertise with us !!!