వామ్మో... నిమిషానికి 245..! 3 రోజుల్లో 10 లక్షలు!

India reports record 352,991 new Covid 19 cases more than 2800 deaths

కరోనా సునామీలా చుట్టేస్తోంది. 24 గంటల్లో 3 లక్షల 52 వేల 991 కేసులు నమోదయ్యాయి. దేశంలో వైరస్ వెలుగు చూసిన తర్వాత.. ఒక్కరోజులో మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రపంచంలో మరో దేశంలోనూ ఇప్పటిదాకా ఒక్కరోజులో మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదు కాలేదు. కరోనా విలయతాండవం చేసిన అమెరికాలోనూ ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో కేసులు లేవు. గడిచిన 24 గంటల్లో వైరస్ 2వేల 812 మందిని బలితీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 28లక్షలు దాటింది. 

దేశంలో ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం దేశంలో ప్రతి నిమిషానికి 245 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసులతో పాటే మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇన్నాళ్లు ఇతర దేశాల్లో మరణ వార్తలు విని అయ్యో అనుకున్న ఇండియన్స్.. ఇప్పుడు ఈ దేశంలోనే ఇలా భారీగా మరణాలు సంభవిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కేవలం మూడు రోజుల్లోనే 10 లక్షల కొత్త కేసులు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజుల్లో ఇండియాలో 22 లక్షల 50 వేల పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఇది 47 శాతం అధికం. 

వారం రోజుల్లో ప్రపంచంలో నమోదైన కేసుల్లో భారత్‌లోనే నమోదైన కేసులే 40 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ రేటు 16 శాతంగా ఉండగా.. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో 30 శాతంగా ఉంది. కరోనా కట్టడి చర్యలకు ముందు ఒక్క ముంబైలోనే 26 శాతం ఉన్న పాజిటివ్ రేటు ఇప్పుడు 14 శాతానికి పడిపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. వైరస్‌ను మూడు వారాల్లో అదుపు చేయవచ్చని ముంబై సిటి కేసులు మరోసారి నిరూపించాయి. కఠిన ఆంక్షలు పెడితే చైన్ బ్రేక్ అవుతుందని... అప్పుడు ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్‌ డాక్టర్ గులేరియా చెప్తున్నారు.  

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య కోటి 73 లక్షల 13 వేల 163గా ఉంది. ఇక మొత్తం కరోనా మృతుల సంఖ్య రెండు లక్షలకు చేరువయింది. లక్షా 95 వేల 123 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు. మరణాల్లోనూ గత వారం రోజులతో పోల్చితే 90 శాతం మరణాల రేటు పెరిగింది. ఇప్పటిదాకా దేశంలో 27 కోట్ల 93 లక్షల 21వేల177 మందికి కరోనా పరీక్షలు జరిపారు. నిన్న ఒక్కరోజే 14 లక్షల 2 వేల 367 మంది శాంపిళ్లు సేకరించారు. గడచిన 24 గంటల్లో 2 లక్షల 19 వేల 272 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 14 కోట్ల 19 లక్షల 11 వేల 223 మందికి వ్యాక్సిన్ వేశారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్ గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతున్నాయి.

 


                    Advertise with us !!!